Tiger Death: ఎల్లారెడ్డి, ఆగస్టు 28 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కట్టకింది తండాలో కరెంట్ తీగలు తగిలి విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత రెండు రోజుల క్రితం తండాకు చెందిన నుద్ధ్య నాయక్ అనే రైతు తన చెరుకు పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు విద్యుత్ తీగలను పంట చుట్టు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత విద్యుత్ తీగలకు తగిలి షాక్ తో మృతి చెందింది. దీంతో ఆ రైతు కంగారుగా ఏమి చేయాలో అర్థం కాక చిరుతపులి కళేబరాన్ని గోతి తీసి పాతి పెట్టాడు. గుర్తు తెలియని వ్యక్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు చిరుత పులి కళేబారాన్ని బుధవారం వెలికి తీశారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన చిరుత పులిని గోతిలో పూడ్చిపెట్టిన రైతును అటవీశాఖ అధికారులు విచారించారు.
ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఉన్నత అధికారులకు నివేదికను అందజేస్తామని అటవిశాఖ రేంజ్ అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండాల్సిన అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ పై దృష్టి పెట్టకపోవడం, రైతులు పంట పొలాల్లో విద్యుత్ తీగలు అమర్చకుండా వారికి అవగాహన కల్పించడం లేదని వన్య ప్రేమికులు కొందరు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణులు మృతి చెందడానికి ఎల్లారెడ్డి రేంజ్ అటవీశాఖ అధికారలే కారణం అంటూ వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండాల్సిన అటవీశాఖ అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండడం లేదని తమ సొంత పనుల నిమిత్తం వచ్చి వెళ్తున్నారని స్థానికులు తెలిపారు