Students Dharna: మెట్ పల్లి, ఫిబ్రవరి 26 (ప్రజా శంఖారావం): అగ్రికల్చర్ కళాశాలలో సరైన వసతులు లేవని, నలుగురు అధ్యాపకులతో వసతులు లేని భవనంలో కాలం వెళ్ళదిస్తున్నామంటూ విద్యార్థులు మండిపడ్డారు. కోరుట్ల పట్టణంలోని అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థినిలు బుధవారం వేములవాడ రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి వసతులు లేని భవనంలో కాలేజీని నిర్వహిస్తున్నారని, అధ్యాపకులు కూడా సరిగ్గా లేరని వారు ఆరోపించారు.
కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్దామంటే, ప్రిన్సిపల్ కూడా అందుబాటులో ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే రాష్ట్రంలోని అన్ని కాలేజీలో ఉన్న విధంగా వసతులు కల్పించాలని, అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ధర్నా కారణంగా రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.