TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు సరికొత్త ప్రయోగాలను చేపడుతుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే క్రమంలో సరికొత్త నిర్ణయాలను మరియు సరికొత్త సంస్కరణలను చేపడుతూ సత్ఫలితాలను సాధిస్తుంది. ప్రస్తుతం ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు మరో ముందడుగు వేసింది.
ప్రయాణికులు తాము ఎక్కాలి అనుకున్న బస్సు ప్రస్తుతం ఎక్కడ ఎక్కడ ఉంది అలాగే బస్టాండ్ కు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తమను గమ్యస్థానంలో దించుతుంది అని అన్ని వివరాలను తెలుసుకునేందుకు ఆర్టీసీ సరికొత్త అప్లికేషన్ బస్ ట్రాకింగ్ ఆప్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ పేరు గమ్యం యాప్. ఆర్టీసీ బస్సులు ఎప్పుడు కూడా సమయానికి రావు, సమయానికి గమ్యస్థానంలో దింపదు అన్న అపవాదును ఇప్పటివరకు మూటగట్టుకున్న ఆర్టీసీ అపవాదును తొలగించుకోవడానికి ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని ఒక క్లిక్ తో ఉన్నచోటనే తెలుసుకునే లాగా ప్రత్యేకమైన అప్లికేషన్ను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చింది.
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడం కోసం ఇప్పటికే ఆర్టీసీ సంస్థలో పలు రకాల సంస్కరణలను తీసుకొని వచ్చి సత్ఫలితాలను సాధిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించడం కోసం గమ్యం యాప్ తీసుకొని వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతన టికెట్ ఇషోయింగ్ మిషన్లను తీసుకొని వచ్చి నగదు రహిత చెల్లింపు విధానానికి శ్రీకారం చుట్టి చిల్లర సమస్యకు చెక్కుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. తమ ఫోన్ లో ఈ గమ్యం యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని కేవలం ఒక్క క్లిక్ తో ఉన్నచోట నుండి ప్రయాణికులు తమ ప్రయాణం చేయాల్సిన ఆర్టీసీ బస్సును ట్రాక్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.