November 18, 2024
Realstate Businessmen's Magic
Realstate Businessmen's Magic

Realstate Businessmen’s Magic: రియల్ మాయా..!

*నాలా కన్వర్షన్ రద్దు చేసి పాసుపుస్తకాలు ఇవ్వాలని అర్జీ..!
**గతంలోనే ప్లాట్లుగా మలిచి విక్రయాలు..?
**కొత్తరకం అడ్డదారుల్లో అధికారులతో కలిసి బేరసారాలు..
*పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల కబ్జాకు ప్రయత్నం..
*ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టే యత్నం..?

” ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొత్తరకం ఆలోచనలతో ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతూ అధికారులతో బేరసారాలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. అలాగే వారి భూముల పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను, ఇరిగేషన్ కేనాళ్లను కబ్జా చేసుకోవడానిక యత్నిస్తున్నారు. నాలా కన్వర్షన్ చేసిన భూముల్లో నాలా రద్దుచేసి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ అధికారుల వద్ద కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొసలి కన్నీరు కారుస్తున్నారు. “

Realstate Businessmen’s Magic: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 08 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వారి భూమిని చదును చేసి ప్లాట్లుగా మలిచి క్రయవిక్రయాలు చేశారు. కానీ వారు వేసిన ప్లాట్లకు లేఅవుట్ అప్రూవల్ రాలేదు. దీంతో గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆ భూమిలో వేసిన హద్దూరాళ్లను అధికారులు తొలగించారు. కానీ అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంతమంది లబ్ధిదారులకు ఆ భూముల్లో చేసిన ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

నాన్ లేఔట్ ప్లాట్లు కావడంతో లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్లు కాలేదు. చేసేది లేక కొంతమంది లబ్ధిదారుల వద్ద తీసుకున్న డబ్బులను సదరు వ్యాపారస్తులు తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. అలా ఇప్పటివరకు ఆ భూమిలో కొన్నేళ్లుగా క్రయావిక్రయాలు నిలిచిపోయాయి. మళ్ళీ గడిచిన రెండు సంవత్సరాల క్రితం మరో వ్యక్తికి ఆ భూమిని మొత్తం ఒక ధరకు ఒప్పందం కుదుర్చుకుని గంపగుత్తగా సదరు వ్యాపారస్తులు విక్రయించారు.

అసలు కథ ఇక్కడే ప్రారంభం…

నాన్ లేఔట్ ప్లాట్లను కొనుగోలు చేసిన కొంతమంది లబ్ధిదారులు తిరగబడి తమవద్ద తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. విషయం బయటకు పోకుండా చేసేది లేక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంతమందికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. నాలా కన్వర్షన్ జరిగిన భూమి కాబట్టి కమర్షియల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ డబ్బులు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని, అలాగే ఇన్కమ్ టాక్స్ చూపించాల్సిన జమాబంధీ లెక్కలు కూడా ఉంటాయన్న ఆలోచనతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అసలు కథ ప్రారంభానికి ఇక్కడే తమ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.

నాల కన్వర్షన్ రద్దుచేసి పంట భూమిగా పాస్ పుస్తకాలు పొందిన తర్వాత ఆ భూమిని గుంటల్లో లబ్ధిదారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునే ఆలోచనతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో వారు చేస్తున్న ఆ భూమి పక్కనే ప్రభుత్వ భూమితో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కెనాల్ భూమిని కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన అధికారులతో ఆ భూమికి సంబంధించిన ఒప్పందంపై బేరసారాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ప్రభుత్వ ఆదాయానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఆలోచనలతో భారీ గండిపడుతుందని చెప్పవచ్చు.

ఎవరు ఎటు పోతే తమకేంటి అన్నట్లుగా అధికారులు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతుంది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చి సొమ్ము చేసుకోవాలన్న దురుద్దేశంతో కొందరు అధికారులు వారికి వత్తాసు పలుకుతూ తోడ్పాటు అందిస్తున్నట్లు వినికిడి. ఈ మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపడితే తప్ప అసలు విషయం బయటపడదని కొంతమంది అంటున్నారు.

అర ఎకరం అమ్మకాల్లో ఇదివరకే కట్టడాలు..

నాలా కన్వర్షన్ చేసిన భూములు కావడంతో కొంతమంది కొనుగోలు చేసి ఆ భూమిలో కట్టడాలు నిర్మించారు. కానీ ఇక్కడే సదరు వ్యాపారస్తుల కొత్తరకం ఆలోచన ఆశ్చర్యం కలగజేస్తుంది. తమ భూమికి చేసిన నాల కన్వర్షన్ అర ఎకరం భూమిని తొలగించి మిగతా భూమికి నాలా కన్వర్షన్ రద్దుచేసి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నదే సదరు వ్యాపారస్తుల అర్జీ. ఈ లెక్కన అమ్ముడుపోయిన భూమిని వదిలేసి మిగిలిన భూమికి నాలా కన్వర్షన్ ఎలా రద్దు చేస్తారని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

అసలు ఆ భూముల్లో జరిగిన అమ్మకాలు ఎలా జరిగాయి అన్నదే ప్రశ్న. కానీ ఇప్పటి వరకు జరిగిన క్రయవిక్రయాలో స్థలాన్ని గుంటల్లో విక్రయించారా? లేదా ప్లాట్లుగా చేసి విక్రయించారా? అన్నది అధికారులు విచారణ జరిపితే నిగ్గు తేలుతుందని స్థానికులు కోరుతున్నారు. కానీ ఎలాంటి విచారణలు లేకుండానే రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో బేరసారాలు కుదుర్చుకొని నాలా కన్వర్షన్ రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ ఘటనపై ఉన్నత అధికారులు విచారణ చేసి అసలు నిజాలు వెలుగులోకి తేవాలన్నది వాస్తవం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!