October 21, 2024
Realstate maafia
Realstate maafia

Realstate Businessmen New Magic:145 లో రియల్ మాయా..!

** పట్టా భూమి పక్కనే ఇరిగేషన్ కెనాల్, అసైన్మెంట్ భూమి..?
** సుమారు 11 ఎకరాల భూమిలో ప్లాట్లు చేసి గతంలో అమ్మకాలు..?
* అదే భూమిలో హద్దురాళ్ళు తొలగించి మళ్ళీ చదును..!
* పాసుపుస్తకాల కోసం ఎత్తుగడులు..!
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రోజురోజుకు తెలివి మీరీపోతున్నారు. అందుతే జుట్టు.. లేదంటే కాళ్లు.. అన్న చందంగా తయారైంది ఆర్మూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి. గతంలో భూమిని చదును చేసి ప్లాట్లుగా మలిచి అమ్మకాలు జరిపారు. ఆ తీరు కాస్త బెడిసి కొట్టడంతో మళ్లీ హద్దురాళ్లను తొలగించి, అదే భూమిని వ్యవసాయ భూమిగా మల్చడానికి చదును చేస్తూ కొత్త రకం అవతారం ఎత్తుతున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు.

Realstate Businessmen New Magic: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 17 (ప్రజా శంఖారావం): రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా చోట్ల భూములను కొనుగోలు చేస్తూ అందిన కాడికి వినియోగదారులకు అమ్మకాలు చేస్తూ కొన్నిచోట్ల మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలో వస్తున్న వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మలిచి అమ్మకాలు జరుపుతున్నారు. ఎలాంటి లేఅవుట్ అనుమతులు లేకుండానే కొంతమందిని బురిడీ కొట్టిస్తూ అమాయక జనాన్ని మోసం చేస్తున్నారు.

సర్వే నెంబర్ 145 లో…

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ శివారులో ఉన్న సర్వే నెంబర్ 145 లో ధరణి రికార్డుల ప్రకారం సదరు లబ్ధిదారుల పేరుపై 11 ఎకరాల పైచీలుకు భూమి ఉంది. మున్సిపల్ పట్టణంలో విలీనం కాకముందు కొటార్మూర్ పేర్కిట్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. ఆ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 145 సర్వే నంబర్ లో ఉన్న పట్టా భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా మలిచి కొంతమంది వినియోగదారులకు విక్రయిస్తున్నారని తెలియడంతో అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు సర్వే నెంబర్ 145 లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్లాట్ల హద్దురాలను తొలగించారు.

మళ్లీ 12 సంవత్సరాల తర్వాత…

దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మాటలను నమ్మి ఆ భూమిలో క్రయవిక్రయాలు చేసిన వినియోగదారులు తాము ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పట్టుబట్టడంతో చేసేది లేక వెంచర్ చేసిన వ్యాపారస్తులు కొంతమందికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లుగా తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వారు అప్పట్లో చేసిన ప్లాట్ల అమ్మకాలు బెడిసి కొట్టడంతో మళ్లీ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే సర్వే నంబర్ భూమిలో నాలా కన్వర్షన్ రద్దుచేసి వ్యవసాయ భూమిగా తమకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆర్మూర్ రెవెన్యూ అధికారుల వద్ద అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. వారు వేసిన కమర్షియల్ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ భూమిని వ్యవసాయ భూమిగా పట్టా పాసు పుస్తకాలు పొంది గుంటల్లో భూమిని రిజిస్ట్రేషన్లు చేసి అమ్మకాలు నిర్వహిస్తామని మళ్లీ కొత్త రకం ఆలోచనతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

రెవెన్యూ అధికారుల విచారణ

రెవెన్యూ అధికారులు సదరు లబ్ధిదారుల అర్జీ మేరకు, ” ప్రజాశంకారావం ” తెలుగు దినపత్రికలో వచ్చిన “రియల్ మాయ” అనే శీర్షిక కథనాలకు స్పందించి విచారణ మొదలుపెట్టారు. ఆ సర్వే నంబర్ భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ అసైన్మెంట్ భూమితో పాటు ఇరిగేషన్ కెనాల్ ఉన్నట్లు అధికారులు గుర్తించామని చెప్పారు. గత పది సంవత్సరాల క్రితం సదరు లబ్ధిదారులు 11 ఎకరాల పైచీలుకు భూమిలో నాలా కన్వర్షన్ ప్రొసీడింగ్ తీసుకొని, ప్లాట్లుగా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సమాచారం. కానీ గతంలో ఆన్లైన్ లేకపోవడంతో నేరుగా నాలా కన్వర్షన్ సర్టిఫికెట్లను ఆర్డీవో కార్యాలయం నుండి జారీ చేశారు.

కానీ ఎల్ ఆర్ యు పి (ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ ప్రాజెక్ట్) నమోదు చేసే క్రమంలో సిబ్బంది నాల కన్వర్షన్ జరిగినట్లుగా ఆన్లైన్లో నమోదు చేసి ఉండకపోవచ్చునని తెలుస్తుంది. కానీ సర్వేనెంబర్ 145 లో నాలా కన్వర్షన్ జరిగినట్లు ఆర్డీవో కార్యాలయం నుండి జారీ అయిన ప్రోసిడింగ్ పత్రాలు, ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆ సర్వే నంబర్ లోని కొంత భూమిని లబ్ధిదారులు వినియోగదారులకు విక్రయించడం, ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రస్తుతం అక్కడ నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేటతెల్లమైందని సమాచారం.

వివరణ: ఆర్డీఓ రాజా గౌడ్, ఆర్మూర్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కోటార్మూర్ శివారులోని సర్వేనెంబర్ 145లో సదరు లబ్ధిదారులు తమకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని అర్జీ పెట్టుకున్న మాట వాస్తవమే. వారి అర్జీ మేరకు స్థానిక తహసిల్దార్ తో విచారణ చేయించాం. కానీ గతంలోనే ఆ సర్వే నెంబర్ కు నాలా కన్వర్షన్ జరిగినట్లుగా ప్రొసీడింగ్ పత్రాలు లబ్ధిదారులకు అందజేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అలాగే అట్టి భూమిలో కొంతమేర నిర్మాణాలు జరిగినట్లుగా తాహసిల్దార్ అందజేసిన రిపోర్టులో ఉంది. ఈ మేరకు తాహసిల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సదరు లబ్ధిదారుల అర్జీని రిజెక్ట్ చేశామని ఆర్డిఓ వివరణ ఇచ్చారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!