RCB IPL 2025: ఐపీఎల్ లో అరుదైన ఫీట్ సాధించిన ఆర్సీబీ ఈసారైనా టైటిల్ సాధించేనా..!

RCB
RCB

RCB IPL 2025: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లో హాట్ ఫేవరేట్ జట్టు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటిది గడిచిన 17 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గింది లేదు. విరాట్ కొహ్లీ ఉన్నా కూడా ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్టార్ ప్లేయర్లు ఉన్నా.. వారు సరైన సమయంలో రాణించకపోవడం, లక్కు కూడా కలిసి రాకపోవడం అంటుంటారు. ఫ్యాన్స్ పదే పదే ఈ సాల్ కప్ నంబుదే అంటుంటే మిగతా జట్ల ఫ్యాన్స్ మాత్రం అదీ కల అంటూ వెక్కిరింపులు చేస్తూనే ఉంటారు.

ఈ సారి మార్పు మొదలైంది..

ఇప్పటి వరకు ఆర్సీబీ పది మ్యాచులు ఆడగా.. అందులో ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. మొత్తం ఏడు మ్యాచుల్లో బయట వేదికల్లోనే ఆరు మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్ సొంత స్టేడియం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెగ్గింది. 17 సీజన్లలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఇలా వరుసగా ఆరు మ్యాచులు వివిధ వేదికల్లో వరుసగా గెలిచిన దాఖలాలు లేవు. ఈ సారి మాత్రం ఆర్సీబీ సరికొత్తగా కనిపిస్తోంది. విరాట్ కొహ్లీ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫిల్ సాల్ట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీనికి తోడు బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ హెజిల్ వుడ్ కూడా బౌలింగ్ లో చాలా కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. కృనాల్ పాండ్యా స్పిన్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు.

ప్లే ఆప్స్ కు దగ్గరగా..

పది మ్యాచుల్లో ఆర్సీబీ ఏడు మ్యాచుల్లో గెలిచి ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్స్ లో టాప్ లోకి వచ్చింది. దీంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేంటి మేం చూస్తున్న ఆర్సీబీ ఇదేనా.. కొంపదీసి ఈ సారి నిజంగానే ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందా ఏంటీ అని అనుకుంటున్నారు. ఎప్పుడూ పాయింట్ల టేబుల్ లో టాప్ లో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ కింద నుంచి చివరిలో ఉండగా.. ఆర్సీబీ మాత్రం దూసుకుపోతుంది. మరో మ్యాచ్ గెలిస్తే చాలు ఆర్సీబీ ప్లే ఆప్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముందు జోరు చూపించిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లు కాస్త చల్లబడ్డాయి. ముంబయి కూడా జోరు పెంచి వరుసగా అయిదు మ్యాచులు విజయం సాధించి రెండో స్థానంలోకి వచ్చేసింది.

ఇప్పటి వరకు మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్ నెగ్గలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా కప్ కొట్టాలని చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. విరాట్ కొహ్లీ బ్యాటింగ్, భువనేశ్వర్ బౌలింగ్, రజిత్ పటిదార్ కెప్టెన్సీ పని చేసి కప్ గెలిస్తే మాత్రం బెంగళూరు ఫ్యాన్స్ కు ఇక పట్టాపగ్గాలు ఉండవు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now