Ration Cards: హైదరాబాద్, ఆగస్టు 09 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిరుపేదల కోసం కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం విధివిధానాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల జారీ ఏర్పాటులో ఆలస్యం అవుతూ రాష్ట్రంలో చాలామంది రేషన్ కార్డుల జారి కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఈ సబ్ కమిటీ ఏర్పటుతో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డుల జారీ విషయంలో ఒక అడుగు ముందుకు వేసినట్లయింది. ఇప్పటికైనా సబ్ కమిటీ రేషన్ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి రేషన్ కార్డులను త్వరగా జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.