Police Action: జుక్కల్, ఆగస్టు 17 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్లులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేయగా మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టుబడ్డట్లు ఆయన వెల్లడించారు.
పెద్ద కొడపగల్ తాజా మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి, చిన్న కొడపగల్ సర్పంచ్ భర్త శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఆర్డిఓ ప్రకాష్, పిట్లం ఎంపీపీ భర్త విజయ్, వ్యాపారవేత్తలు జితేందర్, సుధాకర్, రైస్ మిల్ నిర్వాహకుడు బెజుగం రామకృష్ణ, షేక్ సాగర్, సిద్ధిరాములు ఉన్నట్లు ఆయన చెప్పారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదు, 9 సెల్ ఫోన్లు, 5 కార్లు, ఒక బుల్లెట్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అనంతరం కేసు నమోదు చేసి పిట్లం పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.