“ప్రజా శంఖారావం” వార్త కథనానికి స్పందన
Penaity Impose: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 02 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ లోని ఎస్వీ టిఫిన్స్ క్యాంటీన్ యజమానికి బుధవారం ఉదయం 10వేల రూపాయల జరిమానా ఇచ్చినట్లు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏ రాజు తెలిపారు. ప్రజా శంఖారావం తెలుగు దినపత్రికలో ప్రచురితమైన “హోటల్లో అంతా ‘ ఆ ‘ పరిశుభ్రం” అనే శీర్షికకు స్పందించిన మున్సిపల్ అధికారులు తనిఖీలు చేసి హోటల్లో అపరిశుభ్రంగా ఉన్న ఘటనపై హోటల్ యజమానికి జరిమానా విధించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రైవేటు స్కూల్లు, సినిమా థియేటర్లు, హోటల్, రెస్టారెంట్లు మొదలైన వాటిల్లో సానిటేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క తనిఖీల్లో మున్సిపల్ అధికారులకు అధికారం ఉంటుందని వివరించారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసర ప్రాంతాలపై ప్రజలు అవగాహన తెచ్చుకొని మున్సిపల్ అధికారులకు సమాచారం అందిస్తే సంబంధిత వ్యాపారస్తులకు జరిమానాలు విధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారస్తులు ఆటలు ఆడకూడదని జాగ్రత్తలు పాటించి తమ తమ వ్యాపార సముదాయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.