Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 01 (ప్రజా శంఖారావం): కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 18 కిలోల బంగారం, అరకిలో వెండి ఆభరణాలు, 3 లక్షల ఇరవై వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేయడంతో ఏసిపి రాజా వెంకటరెడ్డి సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా శనివారం ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను ఆయన వెల్లడించారు. గత నెల 26న శివరాత్రి పండుగ రోజు మాక్లూర్, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు ఇండ్లలో చోరీకి పాల్పడి, సుమారు 29 తులాల బంగారం, అరకిలో వెండి, మూడు లక్షల అరవై వేల రూపాయల నగదును దొంగలించాడని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలతో, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ దొంగతనాలకు పాల్పడిన నిందితున్ని పట్టుకొని నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
వరంగల్ కు చెందిన సయ్యద్ హమీద్ ఈ దొంగతనాలకు పాల్పడ్డాడని, గతంలో కూడా ఈయన పై దొంగతనాల కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిజాంబాద్ బైపాస్ రోడ్ లో శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా సంచరిస్తున్న నిందితున్ని తనిఖీ చేయగా దొంగతనానికి సంబంధించిన వివరాలు తెలిశాయని ఆయన అన్నారు. 2018లో నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్ తో పాటు జిల్లా కేంద్రంలో 85 కు పైగా దొంగతనాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసు చేదించడంలో సహాయపడ్డ సౌత్ రూరల్ సీఐ, నార్త్ రూరల్ సీఐ, నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలను కానిస్టేబుళ్లను ఆయన అభినందించి, రివార్డులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు.