Nithin Kamath: ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు బాగా పెరిగిపోయారు. ఈ క్రమంలో యువత త్వరగా ధనవంతులు కావాలని చాలా రకాలుగా సోషల్ మీడియాలో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు తమ జీవితాలను మార్చుకోవాలని, సొసైటీలో డబ్బున్న వారిగా కంఫర్టబుల్ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ట్రేడింగ్ వంటి వాటిని ఎంచుకుంటున్నారు.
అయితే తాజాగా మధ్యతరగతి ప్రజలు ధనవంతులు ఎలా కాగలరో అనే విషయాన్ని దేశీయ బ్రోకరేజ్ సంస్థ జరోధా సీఈవో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జరోధ సీఈవో నితిన్ కామత్ తన ఎగ్స్ ఖాతాలో ధనవంతులు కావడానికి షార్ట్ కట్ మార్గాలు లేవని ఒక పోస్టులో వెల్లడించారు. ధనవంతులు కావాలని కోరుకునే వారికి చాలా ఓపికతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.
అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని ప్రజలు పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాలని ఆయన అందరికీ సూచించారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చేసే కొన్ని తప్పులు గురించి ఆయన ప్రస్తావించారు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలు అప్పులు చేస్తారని అలాగే వాళ్లకు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో అనారోగ్య సమయంలో అప్పుల బారిన పడుతూ ఉంటారని ఆయన పేర్కొన్నారు.
అయితే ధనవంతులుగా మారడానికి షార్ట్కట్స్ అనేవి ఉండవని దానికి క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లు చాలా అవసరమని నితిన్ కామత్ తెలిపారు. ఈరోజుల్లో దేశంలో చాలామంది మధ్య తరగతి ఉచ్చులో చిక్కుకుపోతున్నారని తెలిపారు. ఈరోజుల్లో మధ్య తరగతి ప్రజలు కష్టపడి చదవడం, పనిచేయటం, ఉద్యోగం చేయటం, రుణం తీసుకొని ఇల్లు కొనడం, ఆడంబరమైన వస్తువుల కోసం డబ్బులను ఖర్చు చేయడం వంటి అనేక రకాల చక్రంలో చిక్కుకుపోతున్నారని కామత్ తెలిపారు. ప్రజలు తమ డబ్బును పొదుపు చేయడం అలాగే పెట్టుబడి పెట్టడం మంచి అలవాటని ఆయన తెలిపారు. మధ్యతరగతి ప్రజలు నెలవారి ఖర్చులను తగ్గించుకొని అందులో కనీసం ఒక శాతం డబ్బును ఇండెక్స్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాలని తెలిపారు.