** ముఖ్య నాయకులతో పార్టీ సమావేశాలు
** రాష్ట్ర రాజధాని నుంచే నేతలకు పార్టీ క్యాడర్ కు దిశా.. నిర్దేశం..
* కారు మళ్ళీ పరుగులు పెట్టేనా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ 2023 లో జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గుంబనంగా ఉన్నారు. ఎప్పుడూలేనంతగా సైలెంట్ అయిపోయారు. కేసిఆర్ తెర వెనుక ఉంటూనే అటు తనయుడితో ఇటు కూతురితో రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే వచ్చిన నిజామా బాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఘోర పరాజయం పాలైంది. అవెంటనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుమారు 5 నెలల జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినా…కొన్నాళ్లు ఆరోగ్య కారణాల రీత్యా బయట కన్పించలేదు. తాజాగా కవిత మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ..పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా వ్యూహలు రచిస్తు కారుకు రిపేర్ మొదలెట్టారు.
Kalvakuntla Kavitha repair car: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 8 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలు, వ్యూహాలు ఫలిస్తాయా? లేదా! అన్న చర్చ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మధ్య జోరుగా సాగుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే కవిత మకాం వేసి పార్టీ ముఖ్య నాయకులతో నిరంతరం చర్చలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన దీక్ష దివాస్ కార్యక్రమాలపై ఆరా తీస్తూ పార్టీ వైఫల్యాల గురించి తెలుసుకుంటున్నారు. ఆయా జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆమె సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలా అనే నాణుడు ధోరణి ఇప్పుడు ఆమె అవలంబిస్తున్నట్లు కనబడుతుంది.
జిల్లాలో ఒక వెలుగు వెలిగిన బిఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత చతికిల పడిపోయింది. నిజామాబాద్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ 3 చోట్ల గెలుపొందింది. కానీ జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కారు దిగి చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం బిఆర్ఎస్ కి ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలారు. కవిత పోస్టుమార్టం మొదలుపెట్టారు. లోపాలను సరిదిద్దుతున్నారు.నాయకులతో సుదీర్ఘ చర్చిస్తూ పార్టీని మళ్లీ యాక్టివ్ రోల్ లోకి తీసుకొచ్చే దిశగా ఆమె కారుకు రిపేర్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు దిశా నిర్దేశ్యం చేస్తూ . ప్రజల్లో పార్టీపై మళ్ళీ విశ్వాసం కల్పించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ లోపు కారు గేరు మార్చి స్పీడ్ ను పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు జారవిడుచుకున్న నియోజకవర్గాల్లో పార్టీ పూర్వ వైభవం పై చర్చిస్తూ ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కంగుతిన్న క్యాడర్ కోసం తండ్రి చాటు తనయురాలిగా..
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను కొన్నాళ్లు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకొని మళ్లీ కొన్నాళ్ళ తర్వాత తిరిగి వస్తానన్న కామెంట్స్ తో పార్టీ క్యాడర్ ఒకసారిగా ఖంగుతింది. తండ్రి చాటు తనయుడుగా ఉన్న కేటీఆర్ స్థానంలోకి తండ్రి చాటు తనయురాలిగా కవిత తెరపైకి రానున్నట్లు పార్టీలో క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత వరుసగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం ఈ ఊహగానాలకు ఆజ్యం పోస్తుంది. కానీ ఆమె మొదలెట్టిన కారు రిపేర్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందా లేదా అన్న సందేహాలు పార్టీ క్యాడర్ లో ఉత్పనమవుతున్నాయి.
జైలు జీవితం గడిపి బయటకు వచ్చాక..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె జైలు జీవితం గడిపి బయటకి వచ్చిన తర్వాత అంతగా పార్టీ నాయకులు ఆమె నాయకత్వంలో పనిచేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన షాపింగ్ మాల్స్, జువెలరీ షోరూంల ఓపెనింగ్ సమయంలో పార్టీ ఫండ్ కోసం సదరు యజమానుల వద్ద ఫండ్ కలెక్ట్ చేసినట్లు అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. తండ్రి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడంతో కవిత తీరుపై ఎవరూ నోరు మెదపలేకపోయారు. ఆమె నాయకత్వాన్ని పార్టీలోని ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు విసుకు చెందినట్లుగానే చర్చ కూడా జరిగింది. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీగా ఆమె పోటీ చేసిన సమయంలో ఆమెకు వ్యతిరేకంగానే తెరవెనుక పార్టీ ఎమ్మెల్యేలు కూడా పనిచేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలాంటిది ఇప్పుడు ఆమె నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా లేదా అన్న చర్చ సందేహాలు పార్టీ క్యాడర్ లో ఉత్పన్నమవుతున్నాయి.
పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో మార్పు..?
నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని తొలగిస్తారన్న పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఒకవైపు పార్టీ పూర్వ వైభవానికి వ్యూహాలు రచిస్తూనే క్యాడర్ ను కాపాడుకునే దిశగా ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే తీరుపై గతంలో అసహనం వ్యక్తం చేసిన ఆమె పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగిస్తారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. పార్టీలో మార్పులు చేస్తూ ప్రక్షాళన చేసి క్యాడర్ లో జోష్ పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోన్నట్లు కనబడుతుంది.