“ప్రజా శంఖారావం” కథనానికి స్పందన..
** కేటాయించిన ఇంటి నెంబర్ల రద్దు..
** సర్వేనెంబర్ 202లో డిమార్కెషన్ కోసం సర్వే అధికారులకు ప్రతిపాదనలు
* ఇంటి నెంబర్లతో జరిగిన రిజిస్ట్రేషన్ లపై విచారణ
* 202 లోని 30 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా..!
Started: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ శివారులో ఉన్న సర్వే నంబర్ 202 లోని అసైన్మెంట్ భూముల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఇంటి నెంబర్లు పొంది అసైన్మెంట్ భూములను ప్లాట్లుగా చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై “ప్రజా శంఖారావం” తెలుగు దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు.
202 సర్వే నంబర్ లో విచారణ మొదలుపెట్టిన అధికారులు ఆ భూమిలో కేటాయించిన ఇంటి నెంబర్లను రద్దు చేసినట్లుగా తెలిపారు. అలాగే ఆ సర్వే నెంబర్ లలో జరిగిన రిజిస్ట్రేషన్ లపై జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి నివేదికను అందజేయున్నట్లు చెప్పారు. కొటార్మూర్ శివారులోని 202 సర్వే నంబర్ లోని 30 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా గౌడ్ తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత తమపై ఉందని చెప్పారు. అసైన్మెంట్ భూములను ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇంటి నెంబర్ రద్దు: మున్సిపల్ కమిషనర్
చెరువులు, కెనాల్ లలోని బఫర్ జోన్లలో ఎలాంటి క్రయవిక్రయాలు, నిర్మాణాలు జరగకూడదని ఆయన సూచించారు. అక్రమంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలిక షెడ్లు వేసి తీసుకున్న ఇంటి నెంబర్ 1-125/45/8/A/1 రద్దు చేశమని, ఆ ఇంటి నెంబర్ తో ఆర్మూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన డాక్యుమెంట్ నెంబర్లు 2771/24, 2773/24, 3117/24, 3589/24, 2772/24 వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేశామని మున్సిపల్ కమిషనర్ ఏ రాజు వివరణ ఇచ్చారు.
ఆ ఇంటి నెంబర్ తో పలు రిజిస్ట్రేషన్ డాకుమెంట్లు సృష్టించినట్లు తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు. ఈ ఇంటి నెంబర్ తో కలిగి ఉన్న 5 రిజిస్ట్రేషన్ నెంబర్లను రద్దు చేశామని, జిల్లా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ కు నివేదికను అందజేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.