HEROINE VIJAYASHANTHI: సినిమాను బతికించండి.. ఆవేదనతో విజయశాంతి..
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా.. విజయశాంతి చాలా రోజుల తర్వాత సుదీర్ఘ ప్రసంగం చేశారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రదీప్ ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.
ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లో విజయశాంతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొత్తదనం కచ్చితంగా కనిపిస్తుంది. కనీసం అయిదు లేదా ఆరు షాట్లు కొత్తగా ఉండాలని కోరుకున్నాం. అదే విధంగా చేసి చూపించాం. అయితే మళ్లీ ఈ సినిమా ద్వారా తనకు నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెబుతున్నాను అని అన్నారు. అర్జున్ సన్నాప్ వైజయంతి మూవీ చాలా బాగుంది. ఇందులో కల్యాణ్ రామ్ చాలా బాగా యాక్ట్ చేశారు. పృథ్వీరాజ్ కూడా కీలక రోల్ లో ప్రాణం పెట్టి చేశాడు. రోజు రోజుకు మంచి టాక్ వస్తోంది. కానీ కొంతమంది కావాలనే నెగిటివ్ టాక్ చేస్తున్నారు. అలాంటి వారికి నేను ఒకటే చెబుతున్నా.. సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. నిశ్శబ్ధంగా ఉండండి. అంతే కానీ లేని పోనివి కల్పించి రాయకండి.
సినీ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు అవుతుంది. ఎంతో మంది సినిమాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాంటేడ్ గా కావాలనే కొన్ని దుష్టశక్తులు సినిమాను చెడుగా ప్రచారం చేయాలని చూస్తున్నాయి. అలాంటి వారు సినిమాలు చూడటం మానేయండి.. సినిమాపై కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని కాపాడండి. ఏ సినిమా అయినా సరిగా చూడటం నేర్చుకోండి. అనవసరంగా బురద చల్లాలని చూస్తున్న వారు పద్ధతి మార్చుకోండి. సినిమాను ఖూనీ చేద్దామని ప్రయత్నిస్తున్న దుష్టశక్తులకు వార్నింగ్ ఇస్తున్నా.. వారికి ఇదే నా హెచ్చరిక అని విజయశాంతి ఫైర్ అయ్యారు.
సినిమాలను ఫెయిల్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. జీవితాలు నాశనం అయిపోతాయ్.. ప్రొడ్యూసర్లు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అందరూ హీరోలు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు బాగుండాలని కోరుకుంటున్నాను అని విజయశాంతి అన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరకు నిజమే గెలుస్తుంది. మా సినిమా బాగుంది. రోజు రోజుకు మంచి టాక్ వస్తోంది. ఫైనల్ గా సినిమాను సినిమాగా చూసి మంచి చెప్పడం నేర్చుకోండి. పాజిటివ్ గా మాట్లాడండి సినిమాను బతికించండి అని విజయశాంతి కోరారు.