Farmers Leaders Ultimate: ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 19 (ప్రజా శంఖారావం): రైతుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం లోను కావద్దని, మరో ఉద్యమానికి నాంది పలికేలా చేయొద్దంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా గురువారం రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం, పంటకు బోనస్ తదితర అంశాలపై స్థానిక తహసిల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమానికి ఇచ్చిన పిలుపులో భాగంగా జెఎసి నాయకుల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ గడ్డ ఉద్యమాలకు అడ్డా అని, ఎర్రజొన్న ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి నాంది పలికేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన రైతులకు రుణమాఫీ అందజేయాలని కోరుతూ పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. వెంటనే అర్హులైన రైతులకు రుణమాఫీ తో పాటు పంట పెట్టుబడి సాయం ₹ 7500, బోనస్ ₹ 500 రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేదంటే మరో ఉద్యమానికి నాంది పలికి పెద్ద ఎత్తున రైతు ఉద్యమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
మరో రెండు రోజుల్లో భవిష్యత్ ప్రాణాలిక ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ హరీష్ కుమార్ కు జేఎసి నాయకుల ఆధ్వర్యంలో రైతులు తమ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు దేవరం, దేగాం యాద గౌడ్, గంగారెడ్డి, నూతల శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ప్రభాకర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు