CM Revanth Reddy: వెబ్ డిస్క్, ఆగస్టు 28 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇచ్చిందని, ఆగస్టు 15 నాటికి 18 లక్షల కోట్ల ఖర్చు చేసి రైతు రుణమాఫీ అందించి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం పట్ల శభాష్ సీఎం రేవంత్ రెడ్డి అనిపించుకుంటూ సాహసోపేత నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల కాలేజీలు, స్కూల్స్, కమర్షియల్ భవనాలతో పాటు అక్రమంగా నిర్మించిన భవనాలపై పంజా విసురుతూ హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఎంపీ అన్నారు. పరిరక్షణ కమిటీలు, విద్యాసంఘాలు, కుల సంఘాలు, యువత, ప్రజల నుండి హైడ్రా నిర్ణయం పట్ల మంచి స్పందన లభిస్తుందని ఎంపీ చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు
కేవలం ఒక హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు లేక్ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల జాబితాలో కాలేజీలు, స్కూళ్ళు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే విద్యాసంస్థలకు సెలవులు వచ్చాక వాటిని కూడా కూల్చివేస్తామని ఆయన అన్నారు. హైడ్రా ఏర్పాటు వల్ల తాత్కాలికంగా కొందరికి అన్యాయం జరగచ్చు కానీ దీర్ఘకాలంలో ఎన్నో లాభాలు ఉంటాయని ఆయన అన్నారు. మూసి నది సుందరీకరణ తర్వాత హైదరాబాద్ కి దేశంలోనే పెద్ద నగరాలలో అన్నిటికల్లా కొత్త రూపం చేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీ లతోపాటు ప్రజలకు చేరువయ్యే ప్రతి అవకాశాన్ని రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.
సమర్థవంతంగా రేవంత్ రెడ్డి పాలన
అందరితో సమన్వయంగా వెళుతూ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ సమర్థవంతంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బంగారు తెలంగాణ పళ్లెంలో పెట్టి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాదులోని చెరువుల గురించి పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ద్వారా మధ్యతరగతి, పేద కుటుంబాల మహిళలకు డబ్బు ఎంతో ఆదాయం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని, అందుకే ప్రభుత్వంపై అవాక్కులు చవక్కులు పేలుస్తూ తమ ఉనికిని చాటుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు