CM Revanth Reddy’s arrival in the district: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 22 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 24న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్నట్లు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టబద్రుల ఎమ్మెల్సీ గా గెలిపించడానికి గ్రాడ్యుయేట్స్ మద్దతు తెలుపాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ నిరుద్యోగులకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పట్టబద్రుల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని గుర్తు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపాలని కోరారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.