R Krishnaiah Offer: వెబ్ డెస్క్, సెప్టెంబర్ 25 (ప్రజా శంఖారావం): రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆర్ కృష్ణయ్య తన పదవికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఆర్ కృష్ణయ్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజా ఆఫర్లను ఆయన ముందించాయి. ఈ మేరకు కేంద్రం ఆయనకు కీలక పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామా చేసి వస్తే జాతీయస్థాయిలో కీలక పదవి ఇస్తామని బిజెపి ముఖ్య నేతలు ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. కేంద్రం కృష్ణయ్యకు కీలక పదవి ఇవ్వనున్నట్లు వచ్చిన సమాచారంతో కాంగ్రెస్ నుంచి ఆయనకు ఈ తాజా ఆఫర్ అందింది.
బీసీ సంఘాల ఉద్యమ నేత కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీగా కొనసాగుతున్న సమయంలోనే బిజెపి ముఖ్య నేతలు కృష్ణయ్యతో టచ్ లోకి వెళ్లారు. అయన విద్యార్థి సంఘ నేతగా ఉన్న సమయం నుండి బిజెపి అనుబంధ సంఘాలు, ఆ పార్టీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
బీజేపీ బీసీ సీఎం నినాదం..
తెలంగాణలో బీసీ నినాదంతో బిజెపి మరింత బలపడాలని ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఆ పార్టీ బీసీ సీఎం నినాదం వినిపిస్తుంది. బీసీ సంఘాల నేతగా ఉన్న కృష్ణయ్యను దగ్గరికి తీసుకోవడం ద్వారా మరింత రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో కృష్ణయ్యకు బిజెపి కీలక పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించే అవకాశం
ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు కేంద్రం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉందని బిజెపి ముఖ్య నేతల్లో ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో తాజాగా బీసీ సంఘాల నేతలతో ఆయన జరిపిన సమావేశంలో బీసీ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా బీసీల పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని సంఘాల నేతలు ఆయన కోరారు.
ఈ సమయంలోనే బిజెపి ముఖ్య నేతలు కృష్ణయ్యతో మంత్రాంగం ప్రారంభించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు కృష్ణయ్యకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ మరింత పెంచుకోవాలని ఆ పార్టీ నేతల వ్యూహం. ఇందులో భాగంగానే కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తారని సంకేతాలు అందుతున్నాయి.
కాంగ్రెస్ నేతలు రంగంలోకి..
ఆర్ కృష్ణయ్యను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తాజాగా కృష్ణయ్యతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని తగిన ప్రాధాన్యతతో పాటు కీలక బాధ్యతలు అప్పగిస్తామని పెద్ద ఆఫర్ ఇచ్చారు. అటు బీసీ సంఘాల నుంచి కొత్త పార్టీ ఏర్పాటు కోసం కృష్ణయ్య పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణయ్య ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది.