Riot of youths with knives in the middle of the night: ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 23 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అర్ధరాత్రి కత్తులతో యువకులు వీరంగం సృష్టించారు. క్రికెట్కు చెందిన షేక్ తాహీర్ అనే యువకులపై ఆదివారం అర్ధరాత్రి కొందరు యువకులు కత్తితో దాడికి పాల్పడ్డట్లు బాధితునీ కుటుంబ సభ్యులు తెలిపారు. షాహిద్, జిషన్, సమీర్ అనే యువకులతో తనపై కత్తితో పొడిచారని, వారితోపాటు సుమారు 30 మంది యువకులు గొడవ జరిగిన ప్రాంతంలో ఉన్నట్లు బాధితుడు వెల్లడించాడు. క్షతగాత్రున్ని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా, మెరుగైన చికిత్స కోసం నిజాంబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొరవడిన పోలీస్ పెట్రోలింగ్..
అర్ధరాత్రి రోడ్లపై యువకులు బైక్ రేసింగ్, విచ్చలవిడిగా మందు, ధూమపానం తాగుతూ కత్తులతో రోడ్లపై స్వైర విహారం చేయడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుంది. రాత్రుల్లో పోలీసులు పెట్రోలింగ్ సరిగ్గా చేయడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. అర్ధరాత్రి వరకు ప్రధాన కూడళ్లలోని పాన్ షాపులు, హోటల్లు మూసివేయక పోవడంపై పోలీసుల నిఘా వైఫల్యమే అల్లర్లకు కారణమని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు తెల్లవారుజామున దొంగతనాలు జరగడం పోలీసుల వైఫల్యమని పట్టణవాసులు మండిపడుతున్నారు.