Toll Plaza: కామారెడ్డిజిల్లా, మార్చి 4 (ప్రజా శంఖారావం): మేము లోకల్ మా వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాసేపు టోల్ గేట్లను తెరిచి వాహనాలను ఉచితంగా పంపించడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు.
గతంలో పనిచేసిన సిబ్బంది తమ వద్ద టోల్ వసూలు చేయలేదని, దీంతో తాము కూరగాయలను తీసుకువెళ్లేవారిమని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు సిబ్బంది మారడంతో కొత్తగా వచ్చిన వారు గ్రామస్తుల వద్ద కూడా టోల్ వసూలు చేయడంతో తమ కూరగాయల గంపలను ఎలా తీసుకువెళ్లాలని గ్రామస్తులు ప్రశ్నించారు. తాము లోకల్ కావడంతో టోల్ వసూలు నుండి మినహాయింపు ఇవ్వాలని కొత్తగా వచ్చిన మేనేజర్ ప్రకాష్ కు వినతిపత్రం అందజేశామని గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా లోకల్ గా ఉన్న తమ వద్ద టోల్ వసూలు చేయరాదని, లేదంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. టోల్ ప్లాజా మేనేజర్, సిబ్బంది గ్రామస్తులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని సముదాయించడంతో అక్కడి నుండి గ్రామస్తులు వెళ్లిపోయారు.