Collector: నిజామాబాద్, జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 (ప్రజా శంఖారావం): నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జిల్లాలో 81 పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయాలతో పాటు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు.