October 21, 2024
Gold illegal Business
Gold illegal Business

Gold Illegal Business: పసిడి అసలు సూత్రధారి.. ఆర్మూరు వాసి..!

ఎల్లలు దాటి.. జిల్లాలోకి పసిడి.. పై గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అక్రమ వ్యాపారం పై “ప్రజా శంఖారావం” తెలుగు దినపత్రికలో వస్తున్న వరస వార్తా కథనాలకు పాఠకులు చదివి స్పందించి వివరాలు అడుగుతున్నారు. ఈ కథనానికి సంబంధించి ఇదివరకే రెండు సంచికలను విడుదల చేసాం. ఈరోజు మా దినపత్రిక పాఠకుల కోసం మూడో సంచికలో ఈ కథనం వివరాలు..

Gold Illegal Business: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజా శంఖారావం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు లేకుండానే ఎల్లలు దాటి జిల్లాలోకి పసిడిని తీసుకువచ్చి అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు కొందరు. అలాంటి వారిలో నిజామాబాద్ జిల్లాకు  చెందిన ఒక వ్యాపారి తమ సమీప బంధువులతో ఉన్న సాన్నిహిత్యంతో పసిడిని ఎల్లలు దాటిస్తూ జిల్లాలోకి తీసుకొచ్చి బంగారు వ్యాపారస్తులకు అక్రమ సరఫరా చేసి, గోల్డ్ ఇల్లీగల్ బిజినెస్ తో కోట్ల రూపాయలను గడిస్తున్నారు.

మార్కెట్లో ఉన్న ధర కంటే 10 నుండి 15 వేలు తగ్గించి

ఆర్మూర్ పట్టణానికి చెందిన సదరు బంగారం వ్యాపారి ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో ఉన్న కొందరు వ్యాపారస్తులకు తక్కువ ధరకే బంగారం విక్రయిస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న పసిడి ధర కంటే 10వేల నుండి 15వేల రూపాయల మేర ధర తగ్గించి బంగారాన్ని వ్యాపారస్తులకు విక్రయించడం గమనార్హం. సర్వసాధారణంగా పసిడి పై అందరికీ మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో బంగారం అంటే ఆశ చూపని వారు ఉండరు. అలాంటిది మార్కెట్ విలువ కంటే తక్కువకు రావడంతో ఎగబడి తీసుకుంటారు జనాలు. అదే దారిలో సదరు సూత్రధారి విక్రయిస్తున్న బంగారానికి కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వ్యాపారస్తులకు గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఆర్మూర్ కు చెందిన వ్యాపారి అడ్డదారిలో తీసుకువచ్చిన బంగారం విక్రయిస్తూ కోట్ల రూపాయల విలువైన గోల్డ్ ఇల్లీగల్ బిజినెస్ దారులను సులభతరం చేసుకున్నారు.

ఎక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగకుండా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో ఆ మండల కేంద్రంలోని వ్యాపారస్తులు కూడా సదరు సూత్రధారితో చేతులు కలిపి లాభాలు గడించారు. సంవత్సరాలు గడిచినా కొద్ది వీరి మధ్య నమ్మకం పెరిగింది. పసిడికి తగ్గ ధర కట్టిస్తూ వ్యాపారస్తులు సదరు సూత్రధారి నుండి డబ్బులు చెల్లించి బంగారం కొనుగోలు చేసేవారు.

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ముందుగా పసిడి కావాల్సిన వారు అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో వ్యాపారస్తులకు సూత్రధారి కి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2 కోట్ల రూపాయల వరకు అడ్వాన్సులు తీసుకున్నాడు సూత్రధారి. అప్పటివరకు బాగానే సాగిన వారి వ్యాపారం ఒక్కసారిగా బెడిసి కొట్టిందో ఏంటో తెలియదు, కానీ తీసుకున్న అడ్వాన్స్ కు బదులుగా బంగారం ఇవ్వలేకపోయాడు సదరు సూత్రధారి.

సూత్రధారిపై ఒత్తిడి:

దీంతో బంగారం వ్యాపారస్తులు సూత్రధారిపై తమ అడ్వాన్సు తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. కొన్నాళ్లు కాలయాపన చేసిన సూత్రధారి మరో మార్గం లేకపోవడంతో వ్యాపారస్తుల్లో ఒకరికి రెండు కోట్ల రూపాయల విలువైన భూమిని తన పేరుపై నుండి సదరు ఒక వ్యాపారి పేరు పై రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఈ విషయం మిగతా సభ్యులగా ఉన్న వ్యాపారస్తులకు తెలియక పోవడంతో యధావిధిగా సదరు సూత్రధారిపై ఒత్తిడి తీసుకురావడంతో ఏం చేయాలో పాలు పోక రిజిస్ట్రేషన్ జరిగిన విషయాన్ని మిగతా వ్యాపారస్తులకు తెలియజేశాడు.

దీంతో వ్యాపారస్తులలో ఒకరి మధ్య ఒకరికి విభేదాలు తలెత్తి ఈ అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. బోథ్ మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా ఇన్నాళ్లుగా చేస్తున్న బంగారం వ్యాపారం ఒక్కసారిగా మండల కేంద్రంలో ధారాళంగా వ్యాపించింది. ఈ నోట ఆ నోట స్థానిక పోలీసులకు ఈ సమాచారం అందడంతో వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించినట్లుగా సమాచారం. మరి ఇంత జరిగినా పోలీసుల విచారణలో అసలు నిజాలు వెల్లడి కాలేదా లేక గుట్టు చప్పుడు కాకుండా ఈ కేసుకు సంబంధించిన నిజాలను పూడ్చి పెట్టారా అన్నది పశ్న.

నిఘవ్యవస్థ నిద్రపోతుందా..!

ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సంవత్సరాలుగా ఎల్లలు దాటి జిల్లాలోకి పసిడి తీసుకొస్తున్న సదరు సూత్రధారిపై నిఘా వ్యవస్థ ఎ మేరకు వివరాలు సేకరించిందో తెలియదు. బోథ్ మండల కేంద్రంలో కోట్ల రూపాయల మేర ప్రభుత్వాలకు పన్నులు ఎగ్గొట్టి చేస్తున్న గోల్డ్ ఇల్లీగల్ బిజినెస్ పై నిఘా వ్యవస్థ నిద్రపోతుందన్న వాదనలు గట్టిగా వినపడుతున్నాయి. మరి బోథ్ పోలీసులు మండలంలోని కొందరు బంగారం వ్యాపారస్తులను పిలిచి విచారించినట్లుగా సమాచారం.

విచారణ చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటివరకు బయటకు తెలియలేదు. స్థానిక పోలీసులకు ఈ సమాచారం తెలిసిన జిల్లా ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వలేదా?, తెలిసిన ఎవరు పట్టించుకోలేద అన్న విషయంపై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతుంది. అసలు విషయం తెలిసిన గతంలో బోథ్ పోలీసు స్టేషన్ లో అక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన అధికారి ప్రస్తుతం అక్కడ లేకపోవడంతో ఈ విషయం పై ఎలాంటి విచారణ జరగకుండా నిలిచిపోయిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇంత పెద్ద ఎత్తున పక్క జిల్లా నుండి పసిడి పరుగులు పెడుతూ ఈ జిల్లా నుండి ఆ జిల్లాలోకి గుడ్డు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యాపారంపై నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిఘా పెట్టడంలో విఫలమయ్యారన్నది స్పష్టమవుతుంది.

పసిడి గుట్టు రట్టవుతుందా..?

ఇప్పటికైనా ఈ దొంగ బంగారం వ్యాపారంపై ఇంటలిజెన్స్ వర్గాలు విచారణ చేస్తున్నాయా నిద్రపోతున్నాయా అన్న సందేహాలు ప్రజల మదిలో కలవరపెడుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున దొంగ బంగారం వ్యాపారం కొనసాగిన పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా ఎల్లలు దాటి జిల్లాలోకి వస్తున్న పసిడి గుట్టు రట్టవుతుందా లేక ఈ వ్యాపారానికి సంబంధించిన నిజాలు భూస్థాపితం అవుతాయా అన్నది వేచి చూడాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!