Gold illegal supply: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రజా శంఖారావం): సప్త సముద్రాలు దాటి జిల్లాలోకి పసిడి పరుగులు పెడుతుంది. బంగారంపై అందరికీ మక్కువ ఎక్కువ. దీంతో జిల్లావాసి కీలక సూత్రధారిగా ఉంటూ పక్క జిల్లాలోని బడా వ్యాపారస్తులతో పరిచయాలు పెంచుకొని అక్రమంగా తీసుకువచ్చిన దొంగ బంగారంతో కోట్ల రూపాయల్లో లావాదేవీలు నడిపిస్తున్నాయి. పసిడి వ్యాపారం కాబట్టి సదరు సూత్రధారి దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నచందంగా కొనసాగుతుంది. ఈ వ్యాపారంలో నిజామాబాద్ జిల్లా వాసే కీలక సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం.
గడిచిన 4 సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దొంగ బంగారం వ్యాపారం లావాదేవీలు నడుస్తున్నాయి. నిరోధించాల్సిన అధికారులు వీరిపై దృష్టి పెట్టకపోవడం, పెట్టిన వీరిచ్చే మామూళ్లతో ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెరసి వీరి వ్యాపారం సజావుగా సాగినట్లు తెలుస్తుంది. అడ్డదారుల్లో తీసుకొచ్చిన పసిడిని మార్కెట్లో ఉన్న పసిడి ధర కంటే సుమారుగా 10 నుండి 15వేల రూపాయల తక్కువ ధరకు ఇవ్వడంతో సదరు సూత్రధారి వద్ద ఎగబడి మరి బంగారం వ్యాపారం లావాదేవీలు వ్యాపారస్తులు కొనసాగిస్తున్నారు.
పసిడి ధర భగ్గుమన్న కొనేవారు ఆసక్తి చూపడం సహజం. అలాంటిది మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే పసిడి రావడంతో సదరు వ్యాపారితో ఎగబడి మరి పక్క జిల్లావాసులు లావాదేవీలు నడిపిస్తున్నారు. సజావుగా నడుస్తున్న వీరి వ్యాపారంలోకి ఎలాంటి ఒడిదొడుగులు లేకపోవడం, ఒకరి మధ్య ఒకరికి సమన్వయంతో జరుగుతున్న వ్యాపారంతో కోట్ల రూపాయల మేర లాభాలను ఆర్జించారు.
అడ్వాన్స్ డబ్బులతో గుట్టురట్టు..!
కానీ సదరు సూత్రధారి పక్క జిల్లా వ్యాపారస్తుల వద్ద బంగారం కొనుగోలు విషయంలో అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బులతో వీరి దొంగ బంగారం వ్యాపార లావాదేవీలు బట్టబయలు అయ్యాయి. గడిచిన 4 సంవత్సరాలు ఒక చేత్తో బంగారం మరో చేత్తో డబ్బులు తీసుకుని సజావుగా తమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. మారిన పరిస్థితుల దృశ్య కాబోలు బంగారం కంటే ముందు డబ్బును అడ్వాన్సుగా ఇవ్వాల్సిందేనని సదరు సూత్రధారి చెప్పడంతో, గడిచిన 4 సంవత్సరాలుగా ఇరువురి మధ్య నడిచిన లావాదేవీల్లో ఒడిదొడుగులు లేకపోవడంతో సదరు సూత్రధారిని వ్యాపారస్తులు నమ్మారు.