Parents Andolana: మెట్ పల్లి, ఆగస్టు 17 (ప్రజా శంఖారావం): పిల్లలు స్కూల్ కు వెళ్ళనని మారాం చేస్తే వారిని బుజ్జగించి రెడీ చేసి స్కూల్ కి పంపిస్తాం. కానీ తమ పిల్లలను స్కూల్ నుండి ఇంటికి పంపించడం లేదని తల్లిదండ్రులు ఏకంగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. శనివారం మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల (బాలుర) ముందు 63వ జాతీయ రహదారి పై విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
రాఖీ పండగ సందర్భంగా విద్యార్థులను ఇంటికి పంపించడం లేదని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లితండ్రులు మాట్లాడుతూ ఒక్క రోజు వర్షం పడితే మాత్రం 4 రోజులు సెలవులు ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళండి అంటూ ఫోన్లు చేసే ప్రిన్సిపాల్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండగకి మాత్రం పిల్లలను ఇంటికి పంపమని అడిగితే పంపించడం లేదని వారన్నారు. ప్రిన్సిపాల్ జూబెర్ ను వివరణ కోరగా పై అధికారులు పంపించవద్దని చెప్పారు. రాఖీ పండగకు సెలవు లేదని అంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. రోడ్డు పై విద్యార్థుల తల్లితండ్రులు బైటయించడంతో రహదారి పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.