Raitula Andolana: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 17 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల తాము బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో 2500 మంది రైతుల ఖాతాలు ఉంటే కేవలం 500 మంది మాత్రమే రుణమాఫీ వర్తించిందని, మిగతా 2000 మందికి రుణమాఫీ రాలేదంటూ ఆగ్రహించారు.
రైతుల డాటాను ప్రభుత్వానికి అందజేయడంలో బ్యాంక్ అధికారులు తప్పుడు నివేదికలు పంపించారని ఆరోపించారు. ఇకనైనా అధికారులు రైతుల నివేదికలను అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి రైతుల ధర్నా వద్దకు వెళ్లి రైతులను సముదాయించారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన అర్హులైన రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను అందజేయాలని కోరారు. కెనరా బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు.